Tuesday, 15 July 2014

టెట్‌ అర్హుల ముంగిట ఉపాధ్యాయ పోస్టులు!

* ఎస్జీటీ పోస్టులు మరింత చేరువ!
* పోస్టులకు 'బీఎడ్‌' వారు అనర్హులేనా?
* పాత సిలబస్‌తోనే రాతపరీక్ష!
ఈనాడు - హైదరాబాద్‌: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)లో అర్హత సాధించిన అభ్యర్థులు డీఎస్సీ- 2014 ద్వారా ప్రయోజనం పొందనున్నారు. టెట్‌ మార్కుల ప్రాధాన్యాన్ని డీఎస్సీ- 2014 వరకే కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించినందున ఉపాధ్యాయ నియామకాలకు పోటీపడే వారి సంఖ్య తగ్గనుంది. ఏపీలోని 13 జిల్లాల్లో కలిపి టెట్‌ అర్హత సాధించిన వారి సంఖ్య రెండు లక్షలలోపే ఉంది. ముఖ్యంగా సెకండరీ గ్రేడ్‌ టీచర్ల (ఎస్జీటీ) పోస్టులకు పోటీ తక్కువగా ఉండబోతోంది. కేంద్ర మార్గదర్శకాలు అనుసరించి ఈ పోస్టులను డీఎడ్‌ పూర్తిచేసిన వారికి మాత్రమే కేటాయిస్తున్నారు. బీఎడ్‌ చేసిన వారి కంటే డీఎడ్‌ చేసిన వారి సంఖ్య ఆంధ్రప్రదేశ్‌లో తక్కువగా ఉంది. దీనివల్ల టెట్‌లో అర్హత సాధించిన వారు కాస్త కష్టపడితే ఎస్జీటీ ఉద్యోగం లభించే అవకాశం ఉంది.
ఉమ్మడి రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల నియామకానికి ప్రకటనలు జారీచేస్తే అయిదు నుంచి ఆరు లక్షల వరకు దరఖాస్తు చేసేవారు. ఈ క్రమంలో ఉమ్మడి రాష్ట్రాల్లో ఇప్పటివరకు పలు దఫాలుగా నిర్వహించిన టెట్‌ల ద్వారా అయిదు లక్షల మందికిపైగా అర్హత సాధించారు. న్యాయపరమైన అంశాలను దృష్టిలో ఉంచుకుని.. టెట్‌కు ప్రాధాన్యమిస్తూ డీఎస్సీ-2014ను సెప్టెంబరు అయిదో తేదీనాటికి విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వం సంకల్పిస్తోంది. కిందటేడాది ఉమ్మడిగా డీఎస్సీ జారీచేయాలని భావించగా కార్యరూపం దాల్చలేదు. రాష్ట్ర విభజన నేపథ్యంలో 13 జిల్లాలకు కలిపి పదిన్నర వేల ఉపాధ్యాయ పోస్టులున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే వారిలో 15వేల మందికిపైగా ఉపాధ్యాయుల సేవల హేతుబద్ధీకరణ, ఇతర చర్యల కారణంగా అదనంగా మరో మూడువేల ఉపాధ్యాయ పోస్టులను గుర్తించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ తరుణంలో దాదాపు 14వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడే అవకాశం ఉంది. దీనివల్ల ఒక్కో జిల్లాలో కనీసం వెయ్యి పోస్టులు భర్తీచేసే అవకాశాలున్నాయి. ఈ పోస్టులకు టెట్‌లో అర్హత సాధించిన వారి నుంచి వచ్చే దరఖాస్తులు పరిమిత సంఖ్యలోనే ఉంటాయని భావిస్తున్నారు.
డీఎస్సీ-2014 జారీ తర్వాత...!
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) భారంగా మారినందున దీన్ని తీసేయాలన్న డిమాండ్‌ ఉంది. తొలగిస్తామని తెదేపా హామీ సైతం ఇచ్చింది. దీని ప్రకారం టెట్‌ లేకుండా డీఎస్సీ-2014ను గతంలో మాదిరిగానే ప్రకటించి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తారని అభ్యర్థులు ఆశిస్తున్నారు. టెట్‌ మార్కులకు ప్రాధాన్యం ఇవ్వకుండా రాతపరీక్ష ద్వారా నియామకాలను చేపడితే విషయం న్యాయస్థానం వరకు వెళ్లి ఇబ్బందుల్లోపడే అవకాశం ఉందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. దీని బదులు సెప్టెంబరు ఐదో తేదీన జారీచేసే డీఎస్సీ వరకు టెట్‌ మార్కులకు ప్రాధాన్యం అనివార్యమని పేర్కొంటున్నాయి. డీఎస్సీ- 2014 తర్వాత ప్రతి ఏటా ప్రకటించే డీఎస్సీలకు మాత్రం టెట్‌ లేకుండా చేయాలని అధికారికవర్గాలు యోచిస్తున్నాయి. డీఎస్సీ రాత పరీక్షలోనే టెట్‌కు సంబంధించిన ప్రశ్నలను ఇచ్చినట్లయితే అభ్యర్థులకు నష్టం ఉండదని, దీనివల్ల టెట్‌ తీసివేయడం ద్వారా సమస్యలు ఉండవని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఉపాధ్యాయ ప్రకటన జారీలోనూ ఇందుకు సంబంధించిన షరతులు విధించే అవకాశం ఉంది.
పాత సిలబస్‌ ప్రకారమే...!
వచ్చే సెప్టెంబరులో జారీచేయబోయే ఉపాధ్యాయ నియామకాల ప్రకటనకు సంబంధించిన రాతపరీక్షను పాత సిలబస్‌ ప్రకారమే నిర్వహించే అవకాశాలున్నాయి. పదో తరగతికి కొత్త పాఠ్యప్రణాళికను పరిచయం చేసిన నేపథ్యంలో డీఎస్సీ నియామకాలకు ఏ సిలబస్‌ ఉంటుందన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దీనిపై సంబంధిత వర్గాలవద్ద ప్రస్తావించగా పాతసిలబస్‌ ప్రకారమే డీఎస్సీ-2014 రాత పరీక్ష ఉంటుందన్న సమాధానం వచ్చింది.
ఎస్జీటీ పోస్టులకు బీఎడ్‌ వారు దూరమేనా!
గతంలో సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ పోస్టులను బీఎడ్‌ పూర్తిచేసిన వారితోనూ తగిన నిష్పత్తిలో నింపేవారు. బీఎడ్‌ వారు రాష్ట్రంలో అత్యధికంగా ఉన్నందున సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ పోస్టులకు బీఎడ్‌ వారిని అర్హులను చేయాలని చాలాకాలం నుంచి డిమాండ్‌ ఉంది. దీనికి తెదేపా సానుకూలత వ్యక్తం చేసింది. విద్యా శాఖలో దీని గురించి చర్చ ప్రస్తుతం కనిపించకపోవడం బీఎడ్‌ అభ్యర్థులను ఆందోళనకు గురిచేస్తోంది. బీఎడ్‌ పోస్టులు తక్కువగా ఉంటున్నందున వీరంతా ఎస్టీజీ పోస్టులపైనా ఆశలు పెంచుకున్నారు. మరోవైపు టెట్‌ను తెదేపా తొలగిస్తుందన్న ఆశలో అభ్యర్థులు ఉన్నారు. ఈ పరిస్థితుల్లో డీఎస్సీ-2014 మార్కులకు 80%, టెట్‌లో సాధించిన మార్కులకు 20% ప్రాధాన్యాన్ని యథావిధిగా గతంలో మాదిరిగా ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించడం అభ్యర్థులను ఆందోళనకు గురిచేస్తోంది. ప్రభుత్వం టెట్‌ రద్దు చేస్తుందన్న ఆశలో ఉన్న డీఎడ్‌, బీఎడ్‌ పూర్తిచేసిన వారు కలవరపడుతున్నారు. ఉపాధ్యాయ పోస్టుల రాత పరీక్ష కోసం శిక్షణ పొందే వారిలో బీఎడ్‌ పూర్తిచేసిన వారే అత్యధిక సంఖ్యలో ఉన్నారు.
Share:

0 comments:

Post a Comment

Copyright © Resultsking | Powered by Atozmp3 Design by Chirra Shoban Babu | Blogger Theme by Resultsking.com